కళ్ళ నిర్మాణం, పనితీరు
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌




మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని యదార్థమైనదిగా పరిగణిస్తున్నామంటే అందుకు ముఖ్యకారణం మన కళ్ళే. ఇంద్రజాలం ప్రదర్శించేవారూ, తమకు ఏవో మహత్తులున్నాయని అధికసంఖ్యాకులని నమ్మించగలిగే బాబాలూ ప్రధానంగా ఆధారపడేది "కనికట్టు" మీదనే. కళ్ళారా చూసిన సాక్ష్యం కోర్టు వ్యవహారాల్లో ఎంతో ముఖ్యం. అందుచేత మనిషికి గల పంచేంద్రియాలలో "నయనం ప్రధానమ్‌" అనడంలో సందేహం లేదు. ఎటొచ్చీ మనం చూడలేని రేడియోతరంగాలవంటివి మనచుట్టూ నిరంతరం ప్రసారం అవుతూనే ఉన్నాయని తెలిసినా మనకు అది వింతగా అనిపించదు. మన "కళ్ళు"కప్పి చిటికెడు బూడిదను ఇవ్వగలిగిన స్వాములను చూసినప్పుడు మాత్రం మనం "అతీంద్రియ" శక్తుల గురించి రెచ్చిపోయి మాట్లాడేస్తాం.
మన ప్రపంచం చూడగలగడం మీద ఎంతగా ఆధారపడుతుందంటే చూపులేనివారు ఈ ఆధునికసమాజంలోకూడా ఎంతో కష్టపడవలసివస్తోంది. అలాంటప్పుడు ప్రాచీనకాలంలో ప్రకృతిశక్తులది పైచెయ్యి అయిన రోజుల్లో ప్రాణులకు కళ్ళు లేకపోవడం చావుతో సమానం అయిఉండాలి. (చూడలేనివాళ్ళ ప్రపంచం ఎలా ఉంటుందో ఎచ్‌.జి.వెల్స్‌ "నేత్రహీనుల లోయ" అనే తన కథలో అద్భుతంగా వర్ణించాడు. వారి మధ్యకు అనుకోకుండా వచ్చిపడిన ఒక మామూలు మనిషి వారిపై ఆధిపత్యం చలాయించలేకపోగా, చావుతప్పి, అక్షరాలా కన్ను లొట్టపోయినంత పనిజరిగి, బైట పడతాడు.
సూర్యుడినుంచి తగుమాత్రం దూరాన ఉన్న భూగ్రహం మీదికి తీవ్రమైన కిరణప్రసారం జరుగుతున్నప్పటికీ వాతావరణపు పొరవల్ల మనను చేరే సూర్యకాంతి నిరపాయమైనదిగానే ఉంటుంది. ఈ కిరణాలన్నీ విద్యుదయస్కాంత తరంగాలే అయినా మన కళ్ళకు వెలుతురు రూపంలో కనబడేవి వాటిలో కొన్ని మాత్రమే. ప్రాణులకు కనబడవలసినవీ, వాటి కదలికకు ఆటంకం కలిగించేవీ అనేక వస్తువులు ఈ కాంతిని రకరకాలుగా ప్రతిఫలిస్తాయి. వాటిని తగినంత సూక్ష్మంగా పసిగట్టగలగడమే కళ్ళ పని. జీవరాశి ఆవిర్భవించాక వాటి మనుగడకు అతిముఖ్యమైనవి చక్షువులే. తక్కిన అవయవాలతోబాటు కళ్ళ ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకునేముందు కనుగుడ్ల నిర్మాణం ఎలాంటిదో చూద్దాం. ఇది ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇంత జటిలమైన ఇంద్రియం ఎలా ఆవిర్భవించిందో వివరించడం తన పరిణామవాదానికే ఒక సవాలుగా డార్విన్‌ భావించాడు.
సుమారు ఒక అంగుళం వ్యాసం కలిగిన మన కనుగుడ్ల నిర్మాణం ఎంతో సంక్లిష్టమైనది కనకనే కళ్ళు ఎంతో సున్నితమైన పరికరాలుగా రూపొందాయి. వాటికి మూడు పొరలుంటాయి. అన్నిటికన్నా బైట ఉన్నది దాదాపు పూర్తి కవచంలాగా పనిచేస్తుంది. కంటి ముందు పారదర్శకంగా ఉండే కార్నియా, లేక శుక్లపటలం ఇందులోని భాగమే. రెండో పొర వెనకభాగాన్ని కప్పి ఉంచుతుంది. కనుపాప ఇందులోని భాగమే. అన్నిటికన్నా లోపలి పొరలో రెటీనా, లేక నేత్రపటలం ఉంటుంది. కంటి లోపలికి ప్రవేశించిన కాంతికి స్పందించేది ఇదే. దృఢంగా ఉండే కార్నియాలో అయిదు పొరలుంటాయి. దీని వెనక ఉండే లెన్స్‌, లేక కటకాన్ని రింగ్‌ ఆకారంలో ఉండే సిలీయరీ, లేదా శైలికామయ కండరాలు పట్టి ఉంచుతాయి. కనబడే దృశ్యాన్ని సరిగ్గా ఫోకస్‌ చేసేది ఈ కటకమే. కన్ను ఒక మామూలు కామెరా లాగే కనబడే దృశ్యాన్ని తలకిందులు చేస్తుంది (పటం). దాన్ని సరిగ్గా అర్థం చేసుకునే పని మెదడుది. కనుగుడ్లలో ఉండే ఒక పలచని సంచీవంటి పొరలో చిక్కని ద్రవం నిండి ఉంటుంది. దీని ఒత్తిడివల్ల కనుగుడ్డు మొత్తం కాస్త ఉబ్బి ఉంటుంది.
రెటీనాలో ఎన్నో నాడీకణాలుంటాయి. కాంతికి స్పందించేవి ఇవే. కంటిపాపకు సరాసరి వెనక ఉండే భాగం కాంతిని బాగా గుర్తిస్తుంది. అందులో కాడల్లా ఉండే కణాలూ, శంఖాకారంలో ఉండే కణాలూ దగ్గర దగ్గరగా పోగుపడి ఉంటాయి. మొదటిరకం వెలపలికి వెళ్ళినకొద్దీ ఎక్కువ అవుతాయి. ఇవి తక్కువ వెలుతురును కూడా గుర్తించగలవు. చీకటిలో చూడడానికి తోడ్పడేవి ఇవే. మధ్యలో ఎక్కువగా ఉండే శంఖాకార కణాలకు మరి కాస్త వెలుతురు అవసరమౌతుంది కాని ఇవి సూక్ష్మదృష్టిని కలిగిస్తాయి. కంటిని మెదడుకు కలిపే దృశ్యనాడి వెనకనుండి ప్రవేశిస్తుంది. ఆ కాస్త స్థలమూ కాంతిని గుర్తించలేని "అంధ బిందువు", లేదా బ్లైండ్‌ స్పాట్‌ అవుతుంది. శంఖాకార కణాలు ఒక్కొక్కటీ ఒక్కొక్క కంటి నరానికి జతపడి ఉంటాయి. అందుకనే అవి సునిశిత దృష్టిని కలిగిస్తాయి. కాడ కణాలు మాత్రం సముదాయాలుగా నరాలకు సంధానం అవుతాయి. ఈ విధంగా కళ్ళు వివరంగా, వెలుతురు తక్కువగా ఉన్న దృశ్యాలను సైతం చూడగలవు. మన కళ్ళు సుమారు లక్ష వివరాలను ఒక్కసారిగా గుర్తించగలవు.
మన కళ్ళు అతి సున్నితమైన పరికరాలవంటివి. మరీ తీవ్రమైన కాంతికి కళ్ళు తట్టుకోలేవు. ఏ సూర్యుడికేసో తిన్నగా చూస్తే కళ్ళకు హాని కలుగుతుంది. అలాగే నీరసంగా ఉన్నప్పుడూ, కలత చెందినప్పుడూ కళ్ళు "తిరుగుతాయి". చీకట్లు కమ్ముతాయి. కళ్ళకు కనబడే రంగులను కూడా పూర్తిగా నమ్మడానికి లేదు. చీకటిలో ఉన్న ఒక తెల్లని వస్తువు మీద ఎర్రని కాంతిని వేసి తదేకంగా చూస్తూ ఉన్నవారికి అకస్మాత్తుగా అదే వస్తువు మీద ఎర్రని లైట్‌ను ఆర్పేసి, తెల్లని లైట్‌ వేస్తే అది ముందు నీలంగా అనిపిస్తుంది. కళ్ళకు అడ్జస్ట్‌ అవడానికి కాస్త టైమ్‌ పడుతుంది.
మనకు అతి ముఖ్యమైనవి కనకనే కళ్ళకు ఎన్నో సదుపాయాలున్నాయి. కళ్ళని పైకీ, కిందికీ, రెండు పక్కలకీ కదిలించడానికి కండరాలున్నాయి. కళ్ళకి రక్షణగా రెండేసి కనురెప్పలున్నాయి. ధూళి సోకకుండా వాటి అంచులకు వెంట్రుకలున్నాయి. కనుగుడ్లను కాపాడేందుకు అస్తమానం తేమగా ఉంచగలిగిన గ్రంధులున్నాయి. కనురెప్పల కదలికకు తోడ్పడే కొవ్వును సరఫరా చేసే ప్రత్యేక గ్రంధులున్నాయి. కంట్లోకి స్వేదజలం కారకుండా పైన కనుబొమలున్నాయి. కళ్ళకు సులభంగా దెబ్బ తగలకుండా పుర్రెలో వాటికై తగిన ఆకారంలో గుంటలున్నాయి. ఇంతేకాక ఎక్కువ వెలుతురు నుంచి చీకటిలోకి వచ్చినప్పుడూ, అకస్మాత్తుగా వెలుతురు పెరిగినప్పుడూ కళ్ళని కాపాడటానికీ, వాటి సామర్య్థాన్ని పరిరక్షించడానికీ ఎన్నో ఏర్పాట్లున్నాయి.
కాంతికి భౌతికంగా స్పందించి మనకు దృశ్యాలను చూపించే కనుగుడ్ల నిర్మాణం గురించి ప్రఖ్యాత శాస్త్రవేత్త రిచర్డ్‌ ఫేన్‌మన్‌ తన భౌతికశాస్త్రం పుస్తకంలో ప్రస్తావిస్తాడు. ఫిజిక్స్‌ పుస్తకంలో బయాలజీ పాఠమేమిటని ఆశ్చర్యపోవద్దని ఆయన పాఠకులను హెచ్చరిస్తాడు. విజ్ఞానశాస్త్రాలని విడివిడి భాగాలుగా మనిషే విభజించుకున్నాడనీ, ప్రకృతికి ఆ సంగతి తెలియదనీ ఆయన గుర్తుచేశాడు. జీవపరిణామ క్రమంలో కళ్ళు ప్రస్తుతరూపాన్ని సంతరించుకోవడానికి భౌతికప్రేరణలే కారణం కనక కాంతి స్వభావానికీ, కళ్ళ నిర్మాణానికీ ఉన్న సంబంధం అర్థంచేసుకోవాలి. వివిధ ప్రాణులకు రకరకాల చక్షువులు ఎలా ఏర్పడ్డాయో తెలిస్తే ఇది మరింత బాగా అర్థమౌతుంది.