కాలం అవగాహన - 2
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌



ఈ రోజుల్లో దేనికీ టైము లేకపోవడం మామూలైపోయింది. యాంత్రిక జీవితాలూ, కన్స్యూమరిజం ధర్మమా అని మనుషులు మరబొమ్మలుగా తయారయారు. కూటికి లేనివారు పొట్టకోసమూ, కొంత ఉన్నవాళ్ళు మరింత సంపాదించటం కోసమూ పరుగులు తీస్తూ ఉంటారు. ఈ హడావిడి లేని యుగంలోనే ఆలస్యం అమృతం విషం అంటూ ఉండేవారు. మరీ దూకుడుగా ఉన్నవారిని ఉద్దేశించి నిదానమే ప్రధానం అని కూడా అన్నారు. త్వరగా, తాపీగా, వెంటనే, తక్షణమే, నెమ్మదిగా, నింపాదిగా మొదలైన మాటలన్నిటికీ సందర్భాన్నిబట్టి అర్థాలు ఏర్పడుతూ ఉంటాయి.

సామాన్యంగా మనుషులకు కాలాన్ని గురించిన అవగాహనకు వారి సగటు ఆయుర్దాయమే ఆధారం. ఆ నేపథ్యంలో సంవత్సరాల తరబడిగాని, నెలల, వారాల, గంటల తరబడిగాని ఏదైనా జరగడం మనకు స్వాభావికంగా అనిపించవచ్చు. వాటికి మనలాంటి అవగాహన ఉంటుందో లేదో తెలియదుగాని ఇది అన్ని ప్రాణులకూ వర్తించకపోవచ్చు. ఎందుకంటే కొన్నిరకాల తాబేళ్ళవంటివి తప్ప తక్కిన జంతువులన్నీ మనుషులకన్నా తక్కువ కాలం జీవిస్తాయి. తక్కిన విషయాలలాగే కాలాన్ని గురించి కూడా మన మెదడు అనుభవాన్నిబట్టి మనకు అవగాహన కలిగిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఒక సెకండు మనకు స్వల్పమైనదిగా అనిపిస్తుందిగాని ఆ వ్యవధిలో కొన్ని పురుగులు తమ రెక్కలను కొన్ని వందలసార్లు ఆడించగలవు. కొన్ని కీటకాలు ఒక్క రోజులోనే పుట్టి, పెరిగి, చచ్చిపోవడం కూడా జరుగుతుంది. మరొకవంక కొన్ని రకాల భౌగోళిక మార్పులు జరగడానికి లక్షల, కోట్ల సంవత్సరాలు పట్టవచ్చు. శారీరకంగా మనకు కొన్ని పరిమితులున్నాయి. మన కళ్ళు అతివేగంగా జరిగే మార్పులను గుర్తించలేకపోవడంవల్లనే సెకండుకు 24 ఫ్రేములు తిరిగే సినిమా బొమ్మలు సహజంగా కదులుతున్నట్టుగా అనిపిస్తాయి. కళ్ళతో చూసే దృశ్యాలకు మెదడు స్పందించడానికి కొంత వ్యవధి అవసరం కనకనే వేగంగా నడుపుతున్న కార్లనూ, రైళ్ళనూ అవసరమయినప్పుడు అకస్మాత్తుగా ఆపడానికి ఎంతో సమయస్ఫూర్తి కావాలి.

Salvador Dali(1904-1989). The Persistence of Memory.1931


కాలాన్ని కొలవడానికి మనుషులు అనాదిగా రకరకాల సాధనాలనూ, పరికరాలనూ వాడుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ అప్పటి జీవితావసరాలను బట్టీ, సాంకేతిక సదుపాయాలను బట్టీ రూపొందినవి. క్రీస్తుకు మూడున్నర వేల ఏళ్ళ కిందటే ఈజిప్ట్‌లో ఒక గుంజను నిటారుగా పాతి దాని నీడ ఆధారంగా టైమెంతైందో తెలుసుకునేవారు. ఎండ లేనప్పుడు రోమన్లలాగా గీతలు గీసిన కొవ్వొత్తినో, చైనావారిలాగా ముడులు వేసిన తాడునో కాల్చి, వాటి ద్వారా కాలగణనం చేసేవారు. ఆ తరవాత ఇసక గడియారాలూ, నీటి గడియారాలూ వచ్చాయి. యాంత్రికంగా నడిచే గడియారాల తయారీ మధ్యయుగాల్లో మొదలైంది. ఊగే పెండ్యులమ్‌ (లోలకం) సంగతి గెలీలియో కనిపెట్టాడు. చిన్నప్పుడు చర్చిలో జరిగే ప్రార్థనలను పట్టించుకోకుండా తన ఓరకంటితో చూరునుంచి వేలాడుతున్న దీపాలు గాలికి ఊగే పద్ధతిని గమనించసాగాడు. ఊపు చిన్నదైనా, పెద్దదైనా ఒకే సమయం పడుతుందని చేత్తో తన నాడి కొట్టుకోవడాన్ని బట్టి లెక్క కట్టాడు.

ఆ తరవాత కొన్నేళ్ళకు లోలకాన్ని గడియారాల్లో వాడవచ్చని డచ్‌, ఇంగ్లీష్‌ పరిశోధకులు నిరూపించారు. ఈలోపలే స్ప్రింగ్‌ సహాయంతో నడిచే జేబు గడియారాల తయారీ మొదలైంది. నిమిషాలనూ, సెకండ్లనూ సూచించే ముళ్ళు అమర్చడం పదిహేడో శతాబ్దంలో మొదటగా జరిగింది. అమెరికాలో ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో ఎలెక్ట్రిక్‌ గడియారాల తయారీ జరిగింది. 1960లలో వెలిగే ఎల్‌ఈడీ చేతి గడియారాలూ, మరో పదేళ్ళకు ఎల్‌సీడీ చేతిగడియారాలూ వచ్చాయి. సీసియం అణువుల కంపనాల ఆధారంగా నడిచే ప్రామాణికమైన అణుగడియారాలు మొదటగా 1955లో ఇంగ్లండ్‌లో తయారయాయి. ఇవి ఎంత నిర్దుష్టమైనవంటే వీటిలో 30 కోట్ల సంవత్సరాల్లో ఒక్క సెకండు తేడా రావచ్చు. అంతకంతకూ వేగం పెరుగుతున్న ఆధునిక జీవితాన్ని శాసిస్తున్నవి గడియారాలే. ఇవి లేని పరిస్థితిని ఊహించుకోవడం కూడా కష్టమే.

ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాలవ్యవధిని దూరానికి కొలతగా వాడతాం. ఫలానా చోటినుంచి ఫలానా చోటికి వెళ్ళడానికి ఎంత టైము పడుతుందనేది రవాణా సౌకర్యాన్నిబట్టి ఉంటుంది. కాలమనేదానికి నిజమైన సవాళ్ళన్నీ అంతరిక్షంలో తటస్థించే దూరాల ప్రస్తావనలో ఎదురవుతాయి. వాటికి సంబంధించినంతవరకూ దూరానికీ, కాలానికీ అర్థాన్నివ్వగలిగినవి కాంతి కిరణాలే. మనవాళ్ళు మనోవేగం, వాయువేగం అంటూ ఉంటారు కాని సందేశాలు త్వరగా అందించడానికి కాంతి కిరణాలు బాగా పనికొస్తాయి. ఎందుకంటే విశ్వంలో మనకు తెలిసినంతవరకూ కాంతికన్నా వేగంగా పోగలిగినదేదీ లేదు. కాలవ్యవధిని సూచించేవి సంఘటనలే కనక అవి జరిగినట్టుగా మనకు వెంటనే తెలియాలంటే కాంతిని మించిన సాధనంలేదు. ఎటొచ్చీ కాంతి వేగానికి కూడా పరిమితులున్నాయి. అంతరిక్షంలో అది సెకండుకు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. నక్షత్రాలూ మొదలైనవన్నీ ఎంతెంత దూరాల్లో ఉన్నాయంటే మనకు అన్నిటికన్నా దగ్గిరున్నదాని కాంతి మనను చేరటానికి నాలుగు సంవత్సరాలకు పైగా పడుతుంది. సూర్యకిరణాలే ఎనిమిది నిమిషాల తరవాత భూమిని తాకుతాయి. ఈనాడు మనకు అంతరిక్షంలో ఒకేసారిగా రెండు నక్షత్రాలు పేలడం కనబడినంత మాత్రాన ఆ రెండు సంఘటనలూ ఒకేసారి జరిగాయనుకోవడానికి వీల్లేదు. భూమినుంచి వాటికి గల దూరాన్నిబట్టి అవి వేరువేరు సమయాల్లో జరిగి ఉండవచ్చు. పక్క ఊరి నుంచి నిన్న రాసిన ఉత్తరమూ, విదేశాలనుంచి పదిరోజుల కిందట బయలుదేరిన ఉత్తరమూ ఒకేసారి మన చేతికందినట్టుగా ఇలాంటి సంఘటనలు మనకు ఒకే క్షణంలో జరిగినట్టు అనిపిస్తాయి.

గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో కదులుతున్న రైలునుంచి చూస్తున్నప్పుడు స్టేషనే మనకేసి గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో వస్తున్నట్టుగా అనిపిస్తుంది. రైలు వెళ్ళే దిశగా కదులుతున్నవాటి వేగాలను రైలులో ప్రయాణిస్తున్నవాడు కొలిచినప్పుడు అనుకోని ఫలితాలు లభిస్తాయి. రైలుతోబాటు అదే దిశలో పక్కనే ఎగురుతున్న పక్షుల వేగం రైలుకన్నా తక్కువ కనక అవన్నీ క్రమంగా వెనక్కు పోతున్నట్టు అనిపిస్తుంది. అలాగే రైలుకు ఎదురవుతున్నవన్నీ ఎంత నెమ్మదిగా కదులుతున్నప్పటికీ అతివేగంగా వెనక్కు వెళిపోయినట్టనిపిస్తుంది. ఇలా రైలు వేగాన్ని ఇతర వస్తువులమీద ఆపాదించడంవల్ల వాటి వేగాల్లో హెచ్చుతగ్గులు ఉన్నట్టు అనిపిస్తుంది.

కదులుతున్నవాడు కాంతి వేగాన్ని కొలిచినప్పు డేమవుతుంది? కాంతితో పోలిస్తే రైలువంటివి చాలా నెమ్మదిగా కదులుతాయి కనక రైలుబండికి బదులుగా కాంతిలో సగం వేగంతో కదిలే మరొక రాకెట్‌వంటిది ఉందనుకుందాం. అప్పుడు కాంతివేగం ఒకటిన్నర రెట్లవుతుందా? అలా జరగదనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ కాంతివేగం మారబోదనీ ఐన్‌స్టయిన్‌ అన్నాడు. ఇదెలా సాధ్యం? రాకెట్‌లో ఉన్నవాడికి కాంతివేగంలో మార్పేమీ కనబడదు. బైటినుంచి రాకెట్‌ను గమనిస్తున్నవారికి మాత్రం రాకెట్‌మీద ఉన్న గడియారాలు తమవాటికన్నా నింపాదిగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. రాకెట్‌ వేగం పెరిగినకొద్దీ బైటివారికి దాని కాలవ్యవధి పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సూత్రం కదులుతున్నవాటన్నిటికీ వర్తిస్తుందిగాని నెమ్మదిగా కదులుతున్నవాటి విషయంలో ఈ తేడాలు కొలవలేనంత స్వల్పంగా ఉంటాయి కనక ఎవరూ గమనించరు. తమాషా ఏమిటంటే రాకెట్‌మీద ఉన్నవాడు బైటివాడి గడియారం గురించి సరిగ్గా ఇలాగే అనుకుంటాడు. ఎందుకంటే ఐన్‌స్టయిన్‌ ప్రతిపాదించిన స్పెషల్‌ థియరీ ఆఫ్‌ రిలెటివిటీ, లేక ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం లెక్కన సమానవేగంతో కదులుతున్న వ్యవస్థలన్నీ ఒకటే. రాకెట్‌మీద ఉన్నవాడు తానే నిశ్చలనంగా ఉన్నాననీ, బైట ఉన్నవాడే "వెనక్కు" కదులుతున్నాడనీ అనుకుంటే అతన్ని తప్పుపట్టనవసరం లేదు. ఇక్కడ గమనించవలసిన దేమిటంటే కాలగమనం కూడా సాపేక్షమైనదే.

కాలం గురించి శాస్త్రీయపద్ధతిలో గెలీలియో, న్యూటన్‌ తదితరులు మొదలుపెట్టిన పరిశోధనలను ఐన్‌ష్టయిన్‌ ఆధునిక దిశగా మళ్ళించాడు. స్థలానికీ, కాలానికీ ఉన్న సంబంధాన్ని ఆయన కాంతితో ముడిపెట్టాడు. స్పెషల్‌ థియరీ ఆఫ్‌ రిలెటివిటీ, లేక ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ ఈ విశ్వంలో నిశ్చలనమైనది ఏదీ లేదనీ, అన్నీ కదులుతున్నవేననీ సూచించాడు. ఎదురెదురు దిశలలో వెళుతూ, పక్కపక్కనే ఆగిన రైలుబళ్ళలో ఏ ఒకటి ముందుకు కదిలినా పక్క రైల్లో ఉన్నవారికి కదులుతున్నది ఏ రైలో వెంటనే అర్థంకాదు. అంతరిక్షంలో తేలుతున్న రోదసీనౌకల విషయంలో ఇది మరింతగా అనుభవంలోకి వస్తుంది. ఎదురెదురుగా సెకండుకు 5 కిలోమీటర్ల వేగంతో ఒకదాన్నొకటి సమీపిస్తున్న రాకెట్లలో ఉన్న ఇద్దరు వ్యోమగాముల్లో ప్రతివాడికీ తాను కదలకుండా ఉన్నట్టూ, రెండోవాడు సెకండుకు 10 కిలోమీటర్ల వేగంతో తనకేసి వస్తున్నట్టూ అనిపిస్తుంది. సమానవేగంతో కదులుతున్న వ్యవస్థలన్నీ ఒకటేననీ, వాటిలో ప్రత్యేకమైనదేదీ లేదనీ ఐన్‌ష్టయిన్‌ అన్నాడు. అన్నిటికీ భౌతిక సూత్రాలు ఒకలాగే వర్తిస్తాయి. భూమిమీద సూర్యుడూ, చంద్రుడూ, నక్షత్రాలూ అన్నీ "ఉదయించి, అస్తమిస్తూ" ఉండడం భ్రమేనని మనకు తెలుసు. అలాగని సూర్యుడు నిశ్చలనంగా ఉన్నట్టు చెప్పలేం. సూర్యుడు తనచుట్టూ తాను తిరగడం, బ్రహ్మాండమయిన చక్రంలాగా తిరిగే పాలపుంత గేలక్సీలో ఇతర నక్షత్రాలతోబాటు సూర్యుడు కూడా తిరగడం, గేలక్సీల మధ్య మారుతూ ఉండే దూరాలూ అన్నీ మనకు తెలిసిన విషయాలే. ఈ పరిస్థితిలో ఒకటి నిశ్చలనంగా ఉన్నట్టూ, తక్కినవి మాత్రమే కదులుతున్నట్టూ అనుకోలేం. స్టేషన్‌ కదలకుండా ఉందని అనుకోనవసరంలేదు. స్టేషనూ, రైలూ అన్నీ భూమితోబాటు గుండ్రంగా తిరుగుతున్నవే. రైలు స్టేషన్‌లో ఉన్నవారికి రైలు కదులుతున్నట్టు అనిపించినా, రైల్లో ఉన్నవారికి స్టేషనే తమకేసి వస్తున్నట్టు అనిపించినా ఒకటే.

పై ఉదాహరణలో రాకెట్‌ వేగం కాంతివేగానికి సమానం అయినప్పుడు రాకెట్‌లోని గడియారం పూర్తిగా స్తంభించిపోయినట్టు కనిపిస్తుంది. దీన్ని మామూలు భాషలో అర్థం చేసుకోవాలంటే బైట నిలబడ్డ పరిశీలకుడు ఏదో టెలిస్కోప్‌ సహాయంతో రాకెట్‌ మీదున్న గడియారాన్ని చూస్తున్నట్టుగా ఊహించుకోవచ్చు. గడియారపు దృశ్యాన్ని అందించే కాంతి కిరణాలన్నీ రాకెట్‌తోబాటుగా కాంతి వేగంతో కదిలిపోయాయి కనక చూసేవాడికి మొదటి దృశ్యమే కనిపిస్తూ కాలం ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎవరైనా కాంతిలో పదోవంతు వేగంతో భూమినుంచి 40 సంవత్సరాలపాటు ప్రయాణించి వెనక్కొస్తే వారికి 4 సంవత్సరాలు మాత్రమే గడిచినట్టుగా అనిపిస్తుంది. భూమిమీదే ఉంటున్నవారి వయసు మాత్రం 40 సంవత్సరాలు పెరుగుతుంది. ఇది నిజమే. ఇందులో అభూతకల్పన ఏమీలేదు. తూర్పు, పడమరలుగా ఎగురుతున్న విమానాల్లో ఉంచిన అణు గడియారాలను భూమి మీదున్నవాటితో పోల్చినప్పుడు ఇది నిజమేనని రుజువైంది. అయితే సమానవేగంతో కదులుతున్న వ్యవస్థలన్నీ ఒకటే అయినప్పుడు పై ఉదాహరణలో భూమి మీదే ఉండిపోయినవారికి రాకెట్‌లో వెళ్ళొచ్చిన వ్యక్తి వయసుకూడా 40 సంవత్సరాలు పెరిగినట్టు అనిపించాలి. కానీ అలా జరగదు. ఎందుకంటే వేగంలో హెచ్చు తగ్గులూ, మార్పులూ ఉ న్నప్పుడు ఈ సూత్రాలు వర్తించవు. 40 సంవత్సరాలు ప్రయాణించిన రాకెట్‌ వెనక్కొచ్చిందంటే దాని వేగంలోనూ, దిశలోనూ మార్పు కలిగినట్టే. అందుచేత సైన్స్‌ ఫిక్షన్‌ కథలోలాగా రోదసీ యాత్రికుడు వెనక్కొచ్చి తన వయసులోనే ఉన్న తన మనమలని కలుసుకుంటాడు.

నిత్యజీవితంలో మనం రాకెట్లెక్కి రోదసీయానాలు చెయ్యకపోవచ్చుగాని భౌతిక ప్రపంచంలో ఒక భాగమైన కాలాన్ని గురించి సమగ్రంగా అర్థం చేసుకోవటానికి ఈ విషయాలు పనికొస్తాయి. మన జీవితాలతోనూ, అవగాహనతోనూ ముడిపడిన కాలాన్ని గురించిన శాస్త్రీయ ప్రతిపాదనలను స్థూలంగానైనా అందరం తెలుసుకోవడం అవసరం. అయోమయం తగ్గడానికీ, హేతువాద ధోరణి పెరగడానికీ ఈ సమాచారం కొంతవరకూ ఉపయోగపడే అవకాశం ఉంది.