కాలం అవగాహన - 3
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌



గడిచిపోయిన విషయాలను గురించి తలుచుకోవడమో, చదువుకోవడమో తప్ప మనం చెయ్యగలిగినదేమీ ఉండదు. ఫోటోలూ, ఆడియో, వీడియో రికార్డింగ్‌లూ ఉన్న రోజులైతే వాటిని గురించి మరింత బాగా తెలుసుకోవచ్చు. అంతేకాని ఆ సంఘటనలలో మనం మళ్ళీ జోక్యం కలిగించుకోలేం. మనకు సంబంధించినంతవరకూ కాలం ఎప్పుడూ ముందుకే నడుస్తూ ఉంటుంది. గతం గతః. బతికినన్నాళ్ళూ బతికి మనమంతా "కాలధర్మం" చెందుతాం. మనకు కావాలన్నప్పుడల్లా గతంలోకిగాని, భవిష్యత్తులోకిగాని వెళ్ళడం సాధ్యంకాదు.
అలా జరిగితే ఏమౌతుందో ఊహిస్తూ పంతొమ్మిదో శతాబ్దపు అంతంలో ప్రముఖ ఆంగ్ల రచయిత ఎచ్‌.జి. వెల్స్‌ టైమ్‌ మెషీన్‌ అనే నవల రాశాడు. సైన్స్‌ ఫిక్షన్‌ రచనల్లో అద్వితీయుడైన వెల్స్‌ ఈ నవలలో మనుషులను భూత, భవిష్యత్తుల్లోకి తీసుకెళ్ళగల ఒక కాలయంత్రాన్ని వర్ణిస్తాడు. అందులో కథానాయకుడు 8 లక్షల సంవత్సరాల తరవాతి లోకానికి వెళ్ళి అక్కడ (అప్పుడు అనాలేమో) విచిత్రమైన అనుభవాలకు గురి అవుతాడు. ఇది అప్పట్లో పూర్తిగా కాల్పనిక గాథే. అయితే సైన్స్‌ బాగా అభివృద్ధి అయిన ఈ ఆధునికయుగంలో ఇటువంటిది జరగడం సాధ్యమేనా? ఎవరైనా ఉన్న చోటునుంచి కదలకుండా కాలయానాలు చెయ్యగలరా? ఈ నవల ఇటువంటి ఊహలను మామూలు ప్రజల్లో రేకెత్తించి వారి భావనాశక్తిని తీవ్రంగా ప్రభావితం చేసింది.

సాధ్యాసాధ్యాల మాట ఎలా ఉన్నా ఎవరైనా గతంలోకి వెళితే ఏమౌతుంది? అలా వెళ్ళినవాడు తన తాతనో, ముత్తాతనో చంపేస్తే అతని ఉనికికే మోసం రావచ్చు. ఎందుకంటే అతని పూర్వీకులు పెద్దయి, అతని తల్లిదండ్రులకు జన్మనిచ్చే అవకాశం లేకుండాపోతుంది. బాక్‌ టు ద ఫ్యూచర్‌ అనే సినిమాలో చూపినట్టుగా భవిష్యత్తు అంతా తారుమారవుతుంది.

బాక్‌ టు ద ఫ్యూచర్‌ సినిమా
ఎవరైనా నిజంగా కాలంతోబాటు పరిగెత్తదలుచుకుంటే కాంతివేగంతో ప్రయాణించాలి. అలా ఏ రాకెట్‌లోనో కూర్చుని వెళుతున్నవాడి సరసనున్న గడియారాన్ని బయట నిలబడి మనం చూడగలిగితే దాని ముళ్ళు కదలనట్టుగా అనిపిస్తుందని ఐన్‌స్టయిన్‌ సాపేక్ష సిద్ధాంతం చెపుతుంది. ఇదే థియరీ ఆఫ్‌ రిలెటివిటీ లెక్కన కాంతివేగాన్ని మించగలిగినదేదీ లేదు కాని మాటవరసకు అలా జరిగితే గడియారం వెనక్కు నడిచి మనం గతంలోకి వెళ్ళగలుగుతాం.

ఇది అర్థమవాలంటే ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. ప్రస్తుతం మనకు అంతరిక్షంలో ఎంతో దూరాన జరుగుతున్నట్టుగా కనబడుతున్న సంఘటనలన్నీ గతంలో ఎప్పుడో జరిగిపోయినవేననీ, ఎక్కడో ఏవో సూపర్నోవాలు పేలిపోతే వాటి సమాచారం కాంతి, లేక ఇతర ఎలెక్ట్రోమేగ్నెటిక్‌ తరంగాల ద్వారా చాలాకాలానికి మనకు అందుతోందనీ తెలుసు. అలాగే భూమిమీద జరిగిన సంఘటనల వివరాలుకూడా కాంతి తరంగాల రూపంలో అంతరిక్షంలో ఇప్పటికీ ప్రయాణిస్తూనే ఉంటాయి. ఉదాహరణకు క్రీస్తుకు పూర్వం మూడో శతాబ్దంలో అశోకుడి కళింగయుద్ధం దృశ్యాలన్నీ రెండున్నరవేల కాంతి సంవత్సరాల దూరంలో అంతరిక్షంలో ఇంకా ప్రసారం అవుతూనే ఉన్నాయి. ఇందులో అబద్ధమేమీలేదు. ధూళీ, మేఘాలూ అడ్డం రాలేదనీ, వాటిని వీక్షించగల టెలిస్కోప్‌తో ఎవరో చూస్తున్నారనీ అనుకుంటే ఇలా గడిచిపోయిన సంఘటనలన్నిటినీ రికార్డ్‌ చేసుకోవడం సిద్ధాంతరీత్యా సాధ్యమే. ఎటొచ్చీ ఆ తరవాతి కాలంలో పుట్టిన మనం గనక వాటిని చూడాలంటే ఒక ప్రత్యేక రోదసీనౌకలో కూర్చుని కాంతికన్నా వేగంగా ప్రయాణిస్తూ ఆ దృశ్యం వివరాలను దాటి ముందుకెళ్ళి, అవి చేరే లోపల "అవతల" ఉన్న టెలిస్కోప్‌ను అందుకోవాలి! ఇలాంటిది సాధ్యపడితే గతంలో జోక్యం కలిగించుకోలేకపోయినా ఆ యుగాన్ని "కళ్ళారా" చూడగలుగుతాం. సమస్య ఎక్కడొస్తుందంటే కాంతికన్నా వేగంగా వెళ్ళగలిగిన నౌక ఏదీ లేదు.

ఐన్‌స్టయిన్‌ మొదట ప్రతిపాదించిన ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం (స్పెషల్‌ థియరీ ఆఫ్‌ రిలెటివిటీ) ప్రకారం విశ్వంలో పరిశీలకుడు నిశ్చలనంగా నిలబడగలిగిన స్థానమేదీ ఉండదు. క్రమవేగంతో కదులుతున్న వ్యవస్థలన్నీ సమానమే. ఒక రాకెట్‌ మీద ఉన్న పరిశీలకుడు మరొక రాకెట్‌ సెకండుకు వంద మీటర్ల వేగంతో కదలడం గమనించాడంటే అతను కదలకుండా ఉన్నాడనే అనుకోనవసరంలేదు. రెండు రాకెట్లూ విరుద్ధ దిశలలో సెకండుకు యాభై మీటర్ల వేగంతో కదులుతున్నట్టో, రెండు రాకెట్లూ ఒకే దిశలో ప్రయాణిస్తూ మొదటిదాని కన్నా రెండోదాని వేగం సెకండుకు వంద మీటర్లు ఎక్కువగా ఉన్నట్టో ఇలా రకరకాలుగా అనుకోవచ్చు. రెంటి వేగాలకూ సాపేక్షంగా ఉన్న తేడాయే లెక్కలోకి వస్తుంది. ఇక ఒక రాకెట్లో ఉన్నవాడు రెండో రాకెట్‌లోని వివరాలను పరిశీలించడం మొదలుపెడితే వింత ఫలితాలు కలుగుతాయి. అవతలివాడి గడియారాల నడక మందగిస్తుంది.
అసలు అందులోని వస్తువులన్నీ కదులుతున్న దిశలో నొక్కుకుపోయి పొట్టివైనట్టుంటాయి. వాటి బరువులు పెరుగుతాయి. అవతలి రాకెట్‌ వేగం కాంతివేగాన్ని సమీపిస్తున్న కొద్దీ ఈ మార్పులు పెరుగుతాయి. మారనిదల్లా కాంతివేగం ఒక్కటే. అవతలి రాకెట్‌ ముందు భాగంలో వెనక్కి తిప్పి ఉంచిన ఒక లైట్‌ వెలుగుతూంటే ఆ కిరణాలు ఆ రాకెట్‌ వెనక అంచుకు చేరడానికి ఎంత టైము పడుతుందో లెక్క కట్టామనుకోండి. కాంతివేగం పక్కన నిలబడ్డ మనకు ఎప్పటిలాగే సెకండుకు 3 లక్షల కిలోమీటర్లే ఉంటుంది. కాంతి ప్రయాణించే దూరం కాస్త తగ్గినట్టనిపిస్తుందిగాని దానికి తగినట్టే కాలం కూడా కాస్త నింపాదిగా నడుస్తుంది.

భూమి వాతావరణపు పొర పైభాగంలోకి నిత్యమూ వచ్చి పడే కాస్మిక్‌ కిరణాలు అక్కడ "మ్యూ" కణాలను ఉత్పత్తి చేస్తాయి. రేడియో ధార్మికత కారణంగా ఈ కణాలలో చాలామటుకు కిందికి చేరుకునే లోపల క్షీణించిపోవాలి కాని అలా జరగదు. అతి వేగంగా దూసుకొచ్చే ఈ కణాల విషయంలో కాలం అక్షరాలా మందగించడంతో ఇవి ఉండవలసినదానికన్నా ఎక్కువ సంఖ్యలో భూమిమీది పరికరాలను చేరుకుని, వాటిలో నమోదవుతాయి. ఇది సరిగ్గా ఐన్‌స్టయిన్‌ సాపేక్ష సిద్ధాంతం చెప్పినట్టే జరుగుతుంది.

ఐన్‌స్టయిన్‌ ప్రతిపాదించిన జనరల్‌ థియరీ ఆఫ్‌ రిలెటివిటీలో గురుత్వాకర్షణ కూడా పరిగణనలోకి వస్తుంది. ఇందులో కదులుతున్న వ్యవస్థల్లో వేగవృద్ధి కలిగితే ఏమవుతుందో వర్ణించబడింది. భూమిమీదికి జారవిడిచిన వస్తువులన్నీ భూమ్యాకర్షణవల్ల అంతకంతకూ పెరిగే వేగంతో భూమిని తాకుతాయి. అవి మొదటి సెకండులో 32 అడుగులూ, రెండో సెకండులో 64 అడుగులూ పడుతూ వేగవృద్ధిని సాధిస్తాయి. అంతరిక్షంలో అన్ని గ్రహాలకూ దూరంగా ఉన్న రాకెట్‌లోని మనిషి భారరహిత స్థితిలో తేలుతూ ఉంటాడు. ఆ రాకెట్‌ సరిగ్గా భూమ్యాకర్షణకు సమానమైన వేగవృద్ధితో "పైకి" కదిలితే రాకెట్‌ నేల అతని కాళ్ళకు వచ్చి తగులుతుంది. బయటేం జరుగుతోందో చూడలేకపోతే ఆ వ్యక్తికి భూమిమీద నిలుచున్నట్టే అనిపిస్తుంది.

జనరల్‌ థియరీ ఆఫ్‌ రిలెటివిటీవల్ల గురుత్వాకర్షణ అనేది రేఖాగణితపు సమస్యగా రూపొందింది. ఒక బిందువునుంచి ప్రసరించే కాంతి మరొక బిందువును చేరటానికి వీలున్నంత తక్కువ టైములో అంటే సరళరేఖలో ప్రయాణిస్తుంది. రెండు బిందువులను కలిపే గీతల్లోకెల్లా చిన్నది సరళరేఖ ఒక్కటే అయి ఉండాలని లేదు. ఉదాహరణకు ఒక గోళాకారపు వస్తువు మీద రెండు చుక్కలు పెడితే వాటిని కలిపే గీతలన్నీ వలయాకారంలో ఉండక తప్పదు. మనదేశం నుంచి ఏ అమెరికాకో పోవాలంటే భూమిని చొచ్చుకుని సరళరేఖలో పోలేం కనక వలయాకార మార్గంలో వెళతాం. అంతరిక్షంలో పెద్ద పెద్ద వస్తువుల గురుత్వాకర్షణ కారణంగా ఇటువంటి "వికృతి" ఏర్పడుతుందని ఐన్‌స్టయిన్‌ ప్రతిపాదించాడు.

నాలుగు చెరగులా సాగదీసి పట్టుకున్న రబ్బరు గుడ్డమీద బరువైన వస్తువును ఉంచితే అది దిగలాగుకుపోతుంది. ఆ పరిస్థితిలో దానిమీద చిన్న చిన్న గోళికాయలను తిన్నగా దొర్లించడం వీలవదు. అదే పద్ధతిలో ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్న సూర్యుడి పరిసరాల్లోని స్థలం వికృతి చెందుతుంది. ఇక దాని చుట్టూ తిరిగే గ్రహాలన్నీ దీర్ఘవృత్తాకార కక్ష్యలలో తిరగక తప్పదు. నారింజపండు మీద పాకుతున్న చీమల్లాగా సూర్యుడి చుట్టూ గ్రహాలూ, గ్రహాల చుట్టూ ఉపగ్రహాలూ అన్నీ వలయాకార కక్ష్యలలోనే తిరగవలసివస్తుంది.

కాంతికిరణాలుకూడా అటువంటి పరిస్థితుల్లో ఐన్‌స్టయిన్‌ చెప్పినట్టే అతి తక్కువ సమయం పట్టే వక్రమార్గాన్ని అనుసరిస్తాయని రుజువైంది. సూర్యబింబానికి వెనక భూమిమీదున్న మనకు కనబడకుండా ఉండవలసిన నక్షత్రం ఒకటి సూర్యగ్రహణ కాలంలో కనబడసాగింది. దాని కాంతిరేఖలు సూర్యుడి గురుత్వాకర్షణకు లోబడి, వంగి భూమిని చేరుకున్నాయి. స్థలకాలాలు గురుత్వాకర్షణవల్ల ప్రభావితం అవుతాయని ఐన్‌స్టయిన్‌ రుజువు చేశాడు.

మొత్తంమీద కాలం అనేది మన గడియారాలకే పరిమితం కాదు. అంతరిక్షంలోని బ్రహ్మాండమైన దూరాలూ, ఊహించరానంత పెద్ద గ్రహాలూ, నక్షత్రాలూ మొదలైనవాటి విషయంలో కాలానికి మరొక రకమైన అర్థం ఏర్పడుతుంది. "కాలజ్ఞానం" గురించి ప్రవచనాలు చేసేవారికి ఇటువంటి విషయాలేవీ పట్టకపోవచ్చుగాని అది వేరే సంగతి.