| నా భార్యామణి శ్రీదేవి చేసే శాకాహార వంటలు కొన్ని ఇక్కడ చూడవచ్చు. చాలా అద్భుతంగా చేస్తుంది వంట. అలా ఎందుకు అంటున్నాను అంటే , నా జిహ్వకి రుచుల రోగం ఉంది. ఈ నా రుచుల రోగానికి మందు ఏమిటిరా అంటే , మొదటగా మా అమ్మమ్మ కాశీభట్ల కమలమ్మ గారి అద్భుతమయిన చేతి వంట, ఆవిడ మమ్మల్ని వదిలి పోయాక మా అమ్మ మాగంటి ప్రసూన గారి అమృత ప్రాయమయిన చేతి వంట, ఇక ఇప్పుడు మా అవిడ శ్రీదేవి గారి వంటలు. |
| మా ఆవిడ మిగిలిన ఆడవాళ్ళలాగానే మొదట్లో చెయ్యికాల్చుకునేటప్పుడు, అందరిలాగానే కొంచెం కష్టపడింది కాని, తొందరగా వంటలో మెళకువలు మా అమ్మగారి దగ్గర తెలుసుకుని, నేర్చుకుని నాకు రుచికరమయిన భోజన ప్రాప్తం ఉండేటట్టు చేసింది.అందుకు ఆవిడని అభినందించాలి. అదండి సంగతి. |
| సరే ఇక ఉపోద్ఘాతం ఆపి, ప్రస్తుతానికి మా ఆవిడ చేసే కొన్ని రకాల "అన్నపు వంటకాలు" అంటే ఆంగ్లంలో "రైసు వంటకాలు" ఇక్కడ ఇస్తున్నాను.ముఖ్య గమనిక ఏమిటి అంటే మేము బ్రాహ్మణులం అవటం వల్ల ఫక్తు శాకాహారపు వంటలు మాత్రమే ఉంటాయి ఇక్కడ. ఒక వేళ మీకు కూడా నాలాగా రుచుల గోల ఉంటే, ఈ కింది వంటలు చదువుకుని, నచ్చితే చేసుకుని మీ రుచుల గోల కూడా తీర్చుకోండి.త్వరలో మిగిలిన వంటలు కూడా ఇక్కడ పొందుపరచటానికి ప్రయత్నిస్తాను. |
| మా అమ్మమ్మ గారు, అమ్మ, భార్య - వీళ్ళే కాకుండా మా మేనత్త చల్లా లీలావతి గారు, మేనత్త పోపూరి భవానీగారు, మేనత్త భోగేశ్వరిగారు, పెద్దమ్మ అమ్మనమంచి సుబ్బమ్మగారు, చిన్నమ్మ తూములూరి శాంతకుమారిగారు, చిన్నమ్మ లంక లలితగారు, చిన్న నానమ్మ లక్ష్మీకాంతం గారు - అబ్బో ఇలా చెపుతూ పోతూ ఉంటే ఇంకా ఎంతో మంది అత్యంత రుచికరమయిన వంటలు ప్రేమ ఆప్యాయతలతో కలబోసి చేసి, మాకు తినిపించి మమ్మల్ని ఇంత వాళ్ళని చేశారు. అందరికీ హృదయపూర్వక వందనాలు అర్పిస్తూ.... |