| ఈ పాట పంపించిన రాయలసీమ మిత్రుడు అడుసుమిల్లి శ్రీనివాస రావుకి ధన్యవాదాలతో |
| ******************************************************* |
| జయ మంగళం నిత్య శుభమంగళం |
| జయమంగళం నిత్య శుభమంగళం |
| ఆ సంకనొకబిడ్డ ఈ సంకనొకబిడ్డ |
| కడుపులో ఒకబిడ్డ కదలాడగా |
| ఆరు చాటల బియమొండి |
| మూడుచాటల పప్పొండి |
| సాలకా మా వదినె సట్టినాకే |
| జయ మంగళం నిత్య శుభమంగళం |
| జయమంగళం నిత్య శుభమంగళం |
| అప్పుకొక పళ్ళెంబు పప్పుకొక పళ్ళెంబు |
| కూరనారకొక్క గుండుపళ్ళెంబు |
| అప్పులోడు వచ్చి చెప్పుతో కొడతాంటె |
| అప్పుడే మా బావ పప్పుకేడ్చెనే |
| జయ మంగళం నిత్య శుభమంగళం |
| జయమంగళం నిత్య శుభమంగళం |
| నూగులు నుసి బట్టె గానుగలు గసిబట్టె |
| పెండ్లికొడుకు నెత్తికి పేండ్లుబట్టె |
| పెండ్లికొడుకు సిన్నాయన పేండ్లుబట్టాబోయి |
| గంజిగుంతలోబడి గుంజులాడ |
| జయ మంగళం నిత్య శుభమంగళం |
| జయమంగళం నిత్య శుభమంగళం |
| పల్లెపల్లేదిరిగి పట్నాలన్నీ దిరిగి |
| ముల్లోకములు దిరిగి నిన్నుదెచ్చే |
| మూతి మూడొంకర్లు నడ్డి నాల్గొంకర్లు |
| ముచ్చటైన పెండ్లికూతుర నీకు హారతీ |
| జయ మంగళం నిత్య శుభమంగళం |
| జయమంగళం నిత్య శుభమంగళం |
| ఆ వీధినొక కుక్క ఈ వీధినొక కుక్క |
| నట్టనడి వీధిలో నల్లకుక్క |
| మూడు కుక్కలు కలిసి ముచ్చటాలాడంగ |
| మూలనున్న పెండ్లికొడుకు మూతినాకే |
| జయ మంగళం నిత్య శుభమంగళం |
| జయమంగళం నిత్య శుభమంగళం |
| మంగళం మంగళం మా బావ నెత్తికీ |
| చూరులో ఉండేటి చుంచెలుకకీ |
| మంగళం మంగళం మా వదినె కొప్పుకూ |
| గుంతలో ఉండేటి గోండ్రుకప్పకూ |
| జయ మంగళం నిత్య శుభమంగళం |
| జయమంగళం నిత్య శుభమంగళం |
| ******************************************************* |