శ్రీ వేదనభట్ల వేంకట రమణయ్య భాగవతార్ - హరికథా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గ్రామోఫోన్ రికార్డు ఇచ్చిన మహానుభావులు. 1945లో హెచ్.ఎం.వి వారు రికార్డు చేసిన షిర్డి సాయి చరిత్ర అనే హరికథ - శ్రీ వేదనభట్లవారి గళంలో ఇక్కడ వినవచ్చు. శ్రీ వేదనభట్ల వారి గురించి క్లుప్తంగా: వీరు మూకీ సినిమాల్లో కథానాయకుడిగా వెలుగొందారు. రామాయణం అనే సినిమా 10 పార్ట్లుగా తీసారనీ అందులో శ్రీ వేదనభట్లవారే కథానాయకుడనీ వారి మనవలు శ్రీ మండా కృష్ణమోహన్ తెలియచేస్తున్నారు. ఆదిభట్ల నారాయణదాసు గారి వద్ద శిష్యరికం చేసి ఆ తరువాత హరికథాగానంలో అంతటి పేరూ తెచ్చుకున్న మహానుభావులు శ్రీ వేదనభట్ల. నెల్లూరులో దాదాపు ఆరు నెలలు రామాయణాన్ని హరికథారూపంలో గానంచేసి ప్రేక్షకులని సమ్మోహితులని చేసినందుకు గాను, శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి శ్రీ సాంబమూర్తిగారు వేదనభట్ల వారిని బంగారు కంకణంతో సన్మానించారన్నమాట శ్రీ సాంబమూర్తిగారే కృష్ణమోహన్ గారితో చెప్పారట. తన తాతగారి గళంలో జాలువారిన అపురూపమైన ఈ ఆడియో అందించిన శ్రీ మండా కృష్ణమోహన్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలతో