ఆకాశవాణి వారి "తాళం చెవులు " నాటిక ఇక్కడ వినవచ్చు.ఈ అపురూపమైన నాటిక సేకరణ, కాంట్రిబ్యూటర్: శ్రీ కప్పగంతు శివరామప్రసాద్

*****************************************************

తాళం చెవులు నాటిక గురించిన వివరాలను తెలియచేస్తూ శివరామప్రసాద్ గారేమంటారంటే

నండూరి సుబ్బారావుగారి రచన. 1960లు 1970లలో రేడియోలో హాస్య నాటికల పరంపరని తానే రచించి, నటించి దర్శకత్వం వహించి రేడియో నాటికలకు ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చిన ఘనత మన నండూరి సుబ్బారావుగారిదే. వారికి ఈ విషయంలో రావలిసిన పేరు ప్రఖ్యాతులు రాలేదనే చెప్పాలి.

రొంటినే పెట్టుకున్న తాళం చెవులు పోయాయని అవి అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరో తీశారని తన డబ్బు కాజేయటానికే ఈ పని చేశారని నానా యాగీ చేసే ఒక గయ్యాళి ప్రధాన పాత్ర. ఈ చిన్న నాటికలో ప్రముఖ రేడియో నటీ నటులు అందరూ ఉన్నారు. గయ్యాళి భార్య పాత్రను అద్భుతంగా పోషించిన, అప్పట్లో రేడియో సూర్యకాంతంగా పేరుపడిన పి శీతారత్నంగారు. ఆవిడ మాటలో విరుపు, చెప్పే సంభాషణలో లీనమయ్యి చెప్పే పధ్ధతి, ఆవిడ పోషించిన పాత్రలకు ప్రాణం పోసేవి. ఒక సరదా సరదా భర్తగా సి రామ్మోహనరావుగారు చక్కగా నటించారు . ఆయన హాస్య పాత్ర ధరించటం నాకు తెలిసి ఇదే. తెలుగు మాష్టారిగా వెంకటేశ్వర రావుగారు జీవించారు. ఆయన మాట్లాడుతుంటే మనకు దుంపల మాష్టారే (ఆయన నిక్ నేం) మన కళ్ళముందు కనపడతారు. మరదలు చిట్టిగా వి బి కనకదుర్గగారు ఆవిడకే సొంతమైన ఒక ప్రత్యేక నవ్వు నవ్వుతూ అలవోకగా ఒక అమాయకపు పిల్ల పాత్రను పోషించారు. ఇక నండూరి సుబ్బారావుగారు, చక్కటి పాత్ర పోషణ, పైగా వ్రాసింది ఆయనే కాబట్టి అక్కడక్కడా అప్పటికప్పుడు వచ్చిన మాటలు వేసి మరీ నటించారు.

ఈ నాటకం 1960లలో ఉన్న పరిస్థితులను కళ్ళకు కడతాయి. అప్పట్లో టీ 15 పైసలు పైగా అప్పటికి అదే ఎక్కువ అంటే ఇప్పుడు నమ్మరు.

చక్కటి నాటిక హాస్య ప్రధానమైనది, విని ఆనందించండి.

*****************************************************

అపురూపమైన ఈ నాటిక ఇక్కడ, ఇలా రేడియో అభిమానులకు అందుబాటులో ఉంచటానికి అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే తప్పక తెలియపర్చండి. క్షమాపణలతో వెంటనే తొలగిస్తాను.

భవదీయుడు
మాగంటి వంశీ