ప్రసంగం : తెలుగు కథాసాహిత్యానికి ఆకాశవాణి చేసిన దోహదం
ప్రసంగకర్త : శ్రీమతి తురగా జానకీరాణి (Rtd Asst Director, AIR)
ప్రసారం తేదీ : 30 Sep 2010

జానకీరాణి గారి మీద ఈనాడులో చీకోలు సుందరయ్య గారు వ్రాసిన వ్యాసం ఈ క్రింద చూడవచ్చు:

నవ్య మార్గదర్శిని తురగా జానకిరాణి

ఆకులో ఆకునై... అన్నట్లు పిల్లల్లో ఒకరుగా, 'వనితావాణి' వినిపించే మహిళల్లో మహిళగా, ఉద్యమించే కార్యకర్తల్లో కార్యకర్తగా, 'నిశ్శబ్దంలో ప్రేమనాదాల్ని', 'బాలజగతి'కి పసిడి వెలుగుల్ని పంచిన అక్కయ్య తురగా జానకీరాణి. ఆమె రచయిత్రి, గాయని, నర్తకి, సామాజిక సేవకురాలు, వృత్తిని మించి ప్రవృత్తిలో రాణించి మేధావులకు, జన సామాన్యానికి చేరువైన బహుముఖ ప్రతిభా సంపన్నురాలు.

చలం ఒడిలో పెరిగిన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ తాను పులకించి పోవడమే కాదు వింటున్న వారందర్నీ చలం జ్ఞాపకాలతో పరవశింప చేస్తారు.

స్వాతంత్య్రానికి పూర్వం... 1936లో జన్మించిన జానకీరాణి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఏ. పూర్తి చేశారు. ఉస్మానియా నుంచి అర్థ శాస్త్రంలో ఎం.ఏ. చేసి కమ్యూనికేషన్‌లో ప్రి పిహెచ్‌డి పూర్తి చేశారు. మద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌లో కుటుంబ, శిశు సంక్షేమంలో సర్టిఫికేట్‌ కోర్సు, కౌన్సిలింగ్‌ సర్వీసులో సర్టిఫికెట్‌ కోర్సు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ మండలిలో 1958 నుంచి 63 వరకు ఇన్వెస్టిగేటర్‌గా ఆ తర్వాత కేంద్ర సాంఘిక సంక్షేమ మండలిలో 75 వరకు సంక్షేమాధికారిగా ఆ తర్వాత 90 వరకు ఆకాశవాణిలో ప్రొడ్యూసర్‌గా ఆ తర్వాత నాలుగేళ్ళు ఆకాశవాణి సహాయ సంచాలకులుగా పని చేశారు. ఆమె ఒకవైపు వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఆకాశవాణి, దూదర్శన్‌ల కార్యక్రమ సలహా కమిటీ సభ్యురాలిగా, దూరదర్శన్‌ ఫిల్మ్‌ స్క్రీనింగ్‌ కమిటీ సభ్యురాలిగా, ''లోక్‌ సత్తా సభ్యురాలిగా ఎంతో బాధ్యతతో తన విధుల్ని నిర్వర్తించడం అభినందనీయం.

జానకీరాణి ఏ కార్యక్రమం నిర్వహించినా ఓ సామాజిక ప్రయోజనం ఉండాలని తపన పడ్డారు. చిన్న పిల్లల కార్యక్రమాల్లో వారి సృజనశక్తి సంపూర్ణంగా ఆవిష్కృతమయ్యేలా ఆమె వారిని ప్రోత్సహించారు. స్త్రీల కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నూతనంగా రూపొందిస్తూ శ్రోతల్లో అనేక విధాలా చైతన్యం తెచ్చారు. మూగ, చెవిటి వారి గురించీ, వృద్ధుల గురించీ ఆమె చేసిన రేడియో డాక్యుమెంటరీలు ప్రజల ప్రశంసలందు కోవడమే కాదు రెండు పర్యాయాలు ఆమెకు జాతీయ అవార్డులు తెచ్చాయి.

బాలలకుద్దేశించిన గీత రచనలోనూ ఆమె జాతీయ స్థాయి బహుమతులందుకోవడం విశేషం. ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఐక్యరాజ్యసమితి బాలల విద్యానిధి (యునిసెఫ్‌) రాష్ట్ర విద్యాశాఖల సహకారంతో ''అందరికీ చదువు'' బాల జాగృతి వంటి అనేక కార్యక్రమాల్ని నిర్వహించారు. మహిళా రిజర్వేషన్‌ చట్టంలో కొత్తగా ఎన్నికైన 6,500 మంది మహిళా సర్పంచుల కోసం 'నవయుగం' పేరుతో పాఠాలు రూపొందించి రాష్ట్రంలో స్త్రీలు అధికారాన్ని పొందే చారిత్రక సమయంలో వారిలో అక్షర చైతన్యం నింపారు. 'యోజన' వంటి పత్రికల ద్వారా డ్వాక్రా బృందాల మహిళలకు సకాలంలో సరైన మార్గనిర్దేశం చేశారు.

రచయిత్రిగా ఆమె రంగనాయకమ్మ, వాసిరెడ్డి, మాలతీ చందూర్‌, రామలక్ష్మి వంటి సీనియర్లతో సమంగా రచనలు చేశారు. 1951 నుంచీ కథారచన చేపట్టిన జానకీరాణి ''జానకిరాణి కథలు, ఎర్ర గులాబీలు, నవ్వని పువ్వు'' వంటి కథా సంపుటాలు ప్రచురించారు. ఆమె మూడు నవలల్లో ''ఈ దేశం ఒక హిమాలయం'' నవలగా ఆచరణకు నోచుకోవడమే కాక, అది అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆకాశవాణి నాటకంగా రూపొంది ప్రసారమైంది. అలాగే ఆమె నవల ''సంఘర్షణ'' రచయిత్రిగా సామాజిక సంఘర్షణలకు, కుటుంబ జీవితంలో చోటు చేసుకొంటోన్న మార్పులకు దర్పణంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీకి, కేంద్ర సాహిత్య అకాడమీకి, నేషనల్‌ బుక్‌ ట్రస్టుకి ఆమె ఎన్నో అనువాదాలు చేశారు. రేడియో కోసం నలభైకి పైగా నాటకాలు, రూపకాలు రాశారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తదితర పత్రికల్లో 'దేవయాని' పేరుతో శీర్షికలు నిర్వహించారు. మొపాసా, ఓ హెన్రీ, జె.బి. ప్రీస్టీ వంటి ప్రసిద్ధుల రచనలను ''తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ'' తదితర పత్రికల ద్వారా తెలుగు వారికి పరిచయం చేశారు. తొలినుంచీ దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ప్రభావానికి లోనైన జానకీరాణి సామాజిక సేవ పట్ల అంకిత భావంతో కృషి చేశారు. ఆంధ్ర మహిళా సభతో అనుబంధం కొనసాగించారు. లోక్‌సత్తా కార్యకర్తగా, శ్రామిక విద్యాపీఠం బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌లో ఇకరుగా, గాంధీ కస్తూర్బా సేవా సంఘం ట్రస్టీగా, మహిళా మండలుల ఫెడరేషన్‌కి సలహాదారుగా... సదస్సులు, సెమినార్లు, చర్చలు, వంటివి వందల్లో నిర్వహించారు. నమ్మిన విలువల వ్యాప్తికి నిరంతరం కృషి చేస్తున్నారు.

గృహలక్ష్మీ స్వర్ణ కంకణం, సుశీలా నారాయణరెడ్డి అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి పురస్కారం, చింతాదీక్షితుల అవార్డు, మాదిరెడ్డి సులోచన అవార్డు ఇలా... ఎన్నో అవార్డులు పొందిన తురగా జానకీరాణి స్త్రీ హితైషిణి, నారీ నవ్య మార్గదర్శిని, బాల బంధు వంటి బిరుదులు అందుకొన్నారు. ఆమె జీవితమే మహిళలకు ఒక సందేశం. ఆమెకు చేదోడు వాదోడుగా ఉన్న భర్త కృష్ణమోహన్‌ చాలా ఏళ్ల క్రితమే ప్రమాదంలో అసువులు వీడినా, దుఃఖాన్ని దిగమింగుకొని అన్నీ తానై పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేయడమే కాక సామాజిక కర్తవ్య నిష్టతో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక సేవలోనే ఇప్పటికీ ఆనందం పొందుతూ మార్గదర్శకత్వం వహించడం...

- చీకోలు సుందరయ్య