ఈ అద్భుతమైన ఆడియో అందించిన శివరామ ప్రసాద్ గారు ఇలా అంటారు

రేడియో వింటూ ఉన్నప్పటి నా జ్ఞాపకాలు అని గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తే, మొట్టమొదటిగా తలపుకు వచ్చేది 'భక్తి రంజని" కార్యక్రమమే. కారణం, పొద్దున్నే ఆరుగంటలకు మొదలయ్యే ఈ చక్కటి కార్యక్రమం, చిన్నతనంలో నన్ను లాలిస్తూ నిద్రలేపటమే. మా నాన్నగారు, తెల్లవారుఝామునే లేచి వ్యాయామం చేసి, ఆరుగంటలకల్లా రేడియో పెట్టేవారు. ఆ శ్రావ్యమైన భక్తి పాటలు వింటూ నిద్ర లేవటం ఎంతటి ఆనందాన్నిచ్చేది! ఆయన తన దగ్గర ఉన్న రెండు చేతి గడియారాలు, ఒక అలారం గడియారం వీటన్నిటికి కీ ఇవ్వటానికి సమయం ఏడుగంటల వార్తలు వింటూ. సరిగ్గా తెలుగు వార్తలు మొదలవ్వటం, ఆయన గడియారాలకు కీ ఇస్తూ వాటి టైము సరిచూడటం. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొచ్చినా, అవ్వొక చక్కటి రోజులు.

భక్తి రంజని అనగానే వెంటనే గుర్తుకు వచ్చెవారిలో మొట్టమొదటి వారు శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు గారు , శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం గారు. వీరిద్దరూ పాడినన్ని భక్తి రంజని పాటలు మరెవ్వరూ పాడలేదు. ముఖ్యంగా వోలేటి వెంకటేశ్వర్లుగారు పాడిన భజగోవిందం ఎంత శ్రావ్యంగా, రాగయుక్తంగా ఉందేది. ఆ అద్భుత గానం నుండి కొద్దిగా విని ఆనందించండి.